శ్రీ సత్యనారాయణ గోయెంకా గారు

నేపథ్యం

S.N. Goenka
శ్రీ సత్యనారాయణ గోయెంకా గారు ప్రస్తుత కాలపు గృహస్థ ఆచార్యులలో అగ్రగణ్యులు

భారతీయ సంతతికి చెందినవారే అయినా, శ్రీ గోయెంక గారు బర్మాలో పుట్టి పెరిగారు. బర్మాలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఊబాఖిన్ గారి నుండి విపశ్యన ధ్యాన ప్రక్రియను నేర్చుకొనే మహాద్భాగ్యము కలిగింది, పదునాలుగు సంవత్సరములు తమ గురువు గారి వద్ద శిక్షణ పొందిన పిదప, శ్రీ గోయెంకా గారు 1969 సం||లో భారతదేశం వచ్చి విపశ్యనను బోధింపనారంభించారు. కులమత భేదములతో తీవ్రముగా విభజించబడియున్న దేశములో, శ్రీ గోయెంకా గారు నడుపుచున్న శిబిరాలు సంఘములోని సమస్త వర్గముల వారిని వేలాదిగా ఆకర్షించాయి. అంతేకాక యావత్ప్రపంచ దేశముల నుండి అనేకులు విపశ్యన ధ్యాన శిక్షణ శిబిరాలలో చేరుటకు వచ్చేవారు.

దాదాపు 45 సంవత్సరాల కాలంలో, శ్రీ గోయెంక గారు మరియు అతని చే నియమింపబడ్డ సహాయక ఆచార్యులు భారత దేశంలో మరియు ఇతర తూర్పు, పశ్చిమ దేశాలలో లక్షలాది ప్రజలకు శిబిరాలలో ఈ విద్య నేర్పించారు. ఇప్పుడు ఆయన మార్గదర్శకత్వం లో ఆసియ, యూరోప్, అమెరికాలు, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

శ్రీ సత్యనారాయణ గోయెంక గారిచే నేర్పబడే ఈ పధ్ధతి రెండువేల ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి బుద్ధునిది. బుద్ధుడు ఏదో ఒక వర్గానికి చెందిన మతాన్ని బోధించలేదు. అతను ముక్తి మార్గము, సార్వజనీనము అయిన ధమ్మను బోధించాడు. అదే పరంపరలో శ్రీ గోయెంక గారి విధానం కూడా పూర్తిగా మతాతీతమైనది. ఈ కారణం వల్లే అతని బోధనలు ప్రపంచంలోని అన్ని దేశాలలోని వివిధ నేపథ్యల ప్రజలపై , అన్ని మతాల వారిని మరియు మతాన్ని నమ్మని వారిపై గాఢ ప్రభావం చూపుతున్నాయి.

శ్రీ గోయెంక గారు 2012 సం|| లో భారత దేశ రాష్ట్రపతి నుండి పద్మ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ఇది భారత ప్రభుత్వం బహుకరించే అత్యున్నత పౌర పురస్కారం.

శ్రీ సత్యనారాయణ గోయెంక గారు సెప్టెంబర్ 2013 లో, 89 సం|| ల వయస్సులో, తమ తుది శ్వాస విడిచారు. వారు అవినాశనమైన ఒక వారసత్వాన్ని వదిలి పెట్టి వెళ్లారు. అదే విపశ్యన పద్ధతి. ఇది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికి విస్తృతంగా అందుబాటులో ఉంది.


ఐక్యరాజ్యసమితి శాంతి సమావేశం

2000 సం|| వేసవిలో విపశ్యన ధ్యానం యొక్క ప్రధానాచార్యులు శ్రీ గోయెంక గారు, అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇతర ప్రపంచ ఆధ్యాత్మిక నాయకులతో పాటు "సహస్రాబ్ధి ప్రపంచ శాంతి శిఖరాగ్ర సమావేశం"లో మాట్లాడారు.

ప్రపంచ శాంతి సమావేశంలో శ్రీ గోయెంక గారి ప్రసంగం

శ్రీ బిల్ హిగ్గిన్స్ ద్వార
తేదీ: ఆగస్టు 29, 2000
S. N. Goenka at U.N.
ఫోటో సౌజన్యం భెలిఎఫ్నెత్, ఇంక్

న్యూయార్క్- సహస్రాబ్ది ప్రపంచ శాంతి సదస్సు కోసం తరలివచ్చిన ప్రతినిధులనుద్దేశించి, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్ లో విపశ్యన ఆచార్యులు శ్రీ గోయెంక గారు ఇచ్చిన ప్రసంగం. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి మత, ఆధ్యాత్మిక నేతల ప్రప్రథమ సమావేశం ఇదే.

"వివాదాల పరివర్తనం" అనే సమావేశంలో, శ్రీ గోయెంక గారి ప్రసంగం, మత సామరస్యం, సహనం మరియు శాంతియుత సహా జీవనం వంటి విషయాలను నొక్కి వక్కాణించింది.

"ప్రజలను ఒక వ్యవస్థీకృత మతం నుండి, ఇంకొక వ్యవస్థీకృత మతానికి మార్చడం కాకుండా, మనం ప్రజలను కష్టాల నుండి సంతోషాల వైపు, బానిసత్వం నుండి విముక్తికి మరియు క్రూరత్వం నుండి కారుణ్యానికి మార్చేటందుకు ప్రయత్నం చేయాలి" అని శ్రీ గోయెంక గారు అన్నారు.

శ్రీ గోయెంక గారు తన ప్రసంగాన్ని ఈ సదస్సు మధ్యాహ్న సమావేశంలో గల సుమారు రెండు వేల మంది ప్రతినిధులు, పరిశీలకులను ఉద్దేశించి చేశారు. సి యన్ యన్ వ్యవస్థాపకులు శ్రీ టెడ్ టర్నర్ గారి ప్రసంగం తరువాతి సమావేశంలో గోయెంక గారు మాట్లాడారు. టర్నర్ గారు సదస్సు ఆర్ధిక పోషకుల్లో ఒకరు.

సదస్సు లక్ష్యమైన ప్రపంచ శాంతి స్థాపనను దృష్టిలో ఉంచుకొని, శ్రీ గోయెంక గారు తన ప్రసంగంలో "వ్యక్తులలో శాంతి లేక పోతే ప్రపంచ శాంతి సాధించ లేమ"ని నొక్కి వక్కాణించారు. "ప్రజల హృదయాలలో కోపం, ద్వేషం ఉంటే, ప్రపంచంలో శాంతి ఉండదు. హృదయంలో ప్రేమ మరియు కరుణతో మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యం." అని ఆయన అన్నారు.

మత సంఘర్షణ, ఉద్రిక్తత లను తగ్గించటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని గురించి శ్రీ గోయెంక గారు ఈ విధంగా అన్నారు - "ఒకరి లోపల కోపము, ద్వేషము ఉంటె, వారు క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, ముస్లిం అయినా దుఃఖం అనుభావిన్చావలసినదే"

"అదే విధంగా ఎవరు స్వచ్చమైన హృదయంతో ప్రేమ, కరుణ కలిగిఉంటారో, వారు మనస్సులో స్వర్గానుభుతిని పొందుతారు. ఇదే ప్రకృతి నియమం లేదా దేవుని సంకల్పం" అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు.

"మనం అన్ని మతాలలో ఉన్న సారూప్యాలు, మతాల మూల సారాంశం అయిన హృదయ స్వచ్ఛత మీద దృష్టి కేంద్రీకరిద్దాము. మనం మతం యొక్క ఈ అంశానికి ప్రాముఖ్యతనిచ్చి మతం యొక్క బాహ్య రూపాలైన వివిధ ఆచారాలు, పండుగలు, గుడ్డి నమ్మకాలను విస్మరించాలి." అని ప్రపంచ ప్రధాన మత గురువులకు సంఘానికి చెప్పారు.

గోయెంక గారు తన ప్రసంగాన్ని ముగిస్తూ, అశోక చక్రవర్తి తన ఒకానొక శిలా ఫలకంలో లిఖించిన దానిని ఉటంకించారు - " ఎవరు కూడా తమ స్వంత మతంను మాత్రమే గౌరవించి, ఇతర మతాలను విమర్శించకూడదు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను వివిధ కారణాల వల్ల గౌరవించాలి. అలా చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు తమ స్వంత మతాల అభివృద్ధికి సహాయ పడటమే కాక, ఇతర మతాలకు కూడా సేవ అందించిన వారవుతారు. దీనికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తే, తమ స్వంత మతాలకు సమాధి తవ్విన వారు కావడమే కాకుండా ఇతర మతాలకు హాని చేసిన వారవుతారు. తమ మతాన్ని మాత్రమే గౌరవిస్తు, ఇతర మతాల్ని విమర్శించే వాళ్ళు, తమ మతం పట్ల ఉన్న ఆరాధనా భావం వల్ల, "నేను నా మతాన్ని ప్రకాశింప చేస్తున్నాను" అని అనుకుంటూ ఉండవచ్చు. కాని, వారి పనులు తమ స్వంత మతాన్ని ఇంకా తీవ్రంగా నష్ట పరుస్తాయి. ఐక్యమత్యం మంచిది. మనం అందరం ఇతరులు భోదించిన సిద్దాంతాలను వినడానికి సిద్ధంగా ఉందాము, విందాము."

ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యదర్శి శ్రీ కోఫీ అన్నన్ గారు ఈ సదస్సును "ఇది మనం కొత్త సహస్రాబ్దిలో అడుగిడుతున్న సమయంలో, ప్రపంచంలోని ఉన్నత మత, ఆధ్యాత్మిక నేతలు, శాంతి కోసం సమైక్య పిలుపు ఇవ్వడానికి సమావేశం అయిన సదస్సు. వీరి ఈ పిలుపు ప్రపంచ శాంతి అవకాశాలను మరింత బల పరుస్తాయని ఆశిద్దాం" అని అన్నారు.

ఐక్య రాజ్య సమతిలో ప్రప్రథమముగా జరిగిన ఈ రకమైన సమావేశానికి ఆహ్వానించబడిన వారిలో స్వామి నారాయణ ఉద్యమ ప్రముఖ స్వామి, స్వామి దయానంద సరస్వతి, స్వామి అగ్నివేష్, మాతా అమృతానందమయి మరియు దాదా వాస్వాని లాంటి ఆధ్యాత్మిక నేతలే కాకుండా, డా|| కరణ్ సింగ్ మరియు యల్. యం. సింఘ్వి వంటి ప్రముఖ పండితులు కూడా ఉన్నారు.

సమావేశంలో పాల్గొన్న వారి మత, సాంస్కృతిక వైవిధ్యం గురించి మాట్లాడుతూ శ్రీ అన్నన్ గారు "ఐక్యరాజ్య సమితి అనే ఈ చిత్రయవనిక లో సూటులు, చీరలే కాక క్లెరిక్ల కాలర్లు, సన్యాసినుల వస్త్రాలు, లామల చీవారములు, బిషప్పుల తల పాగాలు, యూదులు ధరించే చిన్న టోపీలు వంటి వస్త్రాలు కూడా ఉన్నాయి" అని అన్నారు.

టిబెట్ నాయకులు లేకపోవడం గురించి శ్రీ అన్నన్ గారిని పదేపదే ప్రశ్నించినప్పటికీ, ఆయన ఆ ప్రశ్నలను సదస్సు లక్ష్యం వైపు తిప్పడానికి ప్రయతిన్చారు. "మతపు నిజమైన పాత్ర శాంతి సంధాతగా ఉండటం, శాంతింపచేయటం. ఆ నిజమైన పాత్రను పునరుద్దరించటానికి సమస్య బైబిల్, తోరా లేదా ఖురాన్ కాదు. నిజానికి విశ్వాసం ఎప్పటికి సమస్య కాదు - సమస్యంతా విశ్వసిస్తున్న వాళ్ళతో మరియు మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తాము అన్న దాని గురించే. మీరు మరొక్క సారి మీ విశ్వాసులకు శాంతి, సహన మార్గాలు నేర్పించాలి" అని అన్నారు.

ప్రపంచ జనాభాలో 83% మంది ఏదో ఒక మత లేదా తత్వ విశ్వాసానికి కట్టుబడి ఉన్నారు. కావున అలాంటి వారిని ఈ మత నాయకులు శాంతి వైపు నడిపించడానికి ప్రభావం చూపగలరనేది ఐక్యరాజ్య సమితి నాయకుని ఆకాంక్ష.

ఒకానొక పత్రంలో ఐక్యరాజ్య సమితి ఈ విధంగా పేర్కొన్నది - "మానవ క్రురత్వపు అతి భయంకర రూపమైన యుద్ధాన్ని, ఆ యుద్ధానికి ఒకానొక మూల కారణమైన పేదరికాన్ని నిర్మూలించగల శక్తి ఆధ్యాత్మికతకు ఉన్నదనే విషయాన్నీ ప్రపంచ సమాజం గుర్తించేలా ఈ సదస్సు తోడ్పడగలదని ఐక్యరాజ్య సమితి ఆశ. మానవాళి తక్షణావసరాలను పరిష్కరించే ప్రయత్నంలో ప్రపంచ ఆధ్యాత్మిక నేతలు ఐక్యరాజ్య సమితితో మరింత సన్నిహితంగా పనిచేసే సమయం ఆసన్నమయింది."

ఈ సదస్సు ఈ గురువారం, ఆగష్టు 31 న ముగుస్తుంది. ఆ రోజు ఈ సదస్సులో పాల్గొనే వారంతా ప్రపంచ శాంతి ప్రకటన మీద సంతకం చేసి, మత, ఆధ్యాత్మిక నాయకుల అంతర్జాతీయ సలహా మండలి గా ఎర్పడుతారు. ఈ సలహా మండలి శాంతి స్థాపనకు, శాంతి పరిరక్షణకు, ఐక్య రాజ్య సమితితోనూ, సమితి ప్రధాన కార్యదర్శితోనూ కలిసి పని చేస్తుంది.

"మత మరియు ఆధ్యాత్మిక నేతల అంతర్జాతీయ సలహా మండలి లక్ష్యం ఏమిటంటే, ఐక్య రాజ్య సమితి పనిని మెరుగు పరచి, బలోపేతం చేయడం" అని ప్రపంచ శాంతి సదస్సు కార్యదర్శి శ్రీ బవ జైన్ గారు అన్నారు. "యుద్ధ కాలంలో ప్రపంచంలోని గొప్ప మత మరియు ఆధ్యాత్మిక గురువులను ఆ ప్రదేశాలకు పంపి, సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించవచ్చునని మేము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము" అని కూడా ఆయన అన్నారు.



ఐక్యరాజ్యసమితి ప్రసంగం

ఈ క్రింద పొందుపరచిన విషయాలు, ఆగష్టు 29 2000సం|| లో సహస్రాబ్ది ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొన్న వారి కోసం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్లో శ్రీ గోయెంక గారు, మంగళవారం, 29న ఇచ్చిన పూర్తి ప్రసంగ పాఠం.

శాంతి కోసం సార్వత్రిక ఆధ్యాత్మికత-శ్రీ . సత్యనారాయణ గోయెంక

తేదీ: ఆగస్టు 29, 2000

చీకటి ఉన్నప్పుడు, కాంతి అవసరమవుతుంది. నేడు హింసాత్మక పోరాటాలు, యుద్ధం, రక్తపాతంతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి శాంతి,సామరస్యం చాలా అవసరం. ఇది మత మరియు ఆధ్యాత్మిక నాయకులకు ఒక గొప్ప సవాలు. ఈ సవాలును మనం స్వీకరించాలి.

ప్రతి మతానికి ఒక బాహ్య రూపం లేదా పై పొర మరియు ఒక అంతర్గత సారంశం లేదా కీలకాంశం ఉంటుంది. పై పొర కర్మలు, ఆచార వేడుకలు, నమ్మకాలు, పురాణాలు, సిద్ధాంతాలను కలిగి ఉంటుంది. ఇవి మతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాని అన్ని మతాలలో ఒకే అంతర్గత సారాంశం ఉంటుంది: ప్రేమ, కరుణ, సహనం, క్రమశిక్షణలతో కూడిన స్వచ్ఛమైన మనసు యొక్క సార్వత్రిక బోధనలైన నైతికత మరియు దాతృత్వం. ఈ సామాన్య బోధనా సారాంశాన్ని, అన్ని మత నాయకులు నొక్కి చెప్పాలి ఇంకా అన్ని మత మద్దతుదారులు పాటించాలి. మతాల అంతర్గత సారాంశానికి సరైన ప్రాముఖ్యత ఇచ్చి, బాహ్య అంశాలపై సహనం వహిస్తే సంఘర్షణలను కనీస స్థాయికి తగించవచ్చు.

అందరు వారి మతాన్ని నమ్మడానికి, అనుసరించడానికి స్వతంత్రులు. కాని అలా చేయడంలో వారు తమ మత సారాంశా ఆచరణను విస్మరించకుండా, తమ స్వంత సంప్రదాయాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మరియు ఇతర సంప్రదాయాలను ఖండించడం లేదా తక్కువ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

విశ్వాసాల మద్య ఉన్న వైవిద్యం కారణంగా మనం ఈ తేడాలను ఎలా దాటావేయవచ్చు మరియు శాంతి కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను ఎలా సాధించవచ్చు? పరిపూర్ణ ఙ్ఞానుడైన బుద్ధుడిని, వివిధ అభిప్రాయాలూ కలిగిన ప్రజలు సంప్రదించే వాళ్ళు . వారందరికీ అతనికి "మనం మన తేడాలను ప్రక్కన పెడదాం. మనమందరం అంగీకరించే విషయాలపై దృష్టి పెట్టి వాటిని ఆచరిద్దాం. వైరం ఎందుకు?" అని చెప్పే వారు. ఆ తెలివైన వాదం ఇప్పటికి విలువైనదే.

నేను ఒక పూరాతన భూమి నుండి వచ్చాను. ఆ భూమి నుండి సహస్రాబ్ధాలుగా అనేక, వివిధ ఆధ్యాత్మిక మరియు తత్వ శాస్త్రాలు జన్మించాయి. అక్కడక్కడ కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ నా దేశం శాంతియుత సహజీవనానికి ఒక నమూన. సుమారు 2300 సంవత్సరాల క్రితం ఆశోక చక్రవర్తిచే ఈ దేశం పరిపాలించబడినది. తన సామ్రాజ్యం ఈనాటి ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు విస్తరించబడినది. తన పాలనలో ఈ కారుణ్య పాలకడు అన్ని విశ్వాలు గౌరవించ తగినవని ప్రకటించి శిలా ఫలకాలు చెక్కించాడు. దాని ఫలితంగా తన పాలనలో అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల యొక్క అనుచరులు సురక్షతంగా భావించారు. అతను ప్రజలను నైతికంగా జీవించమని, తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవించమని, హత్యలు చేయవొద్దని ఆయన చెప్పాడు. అతను తన ప్రజలకు చెప్పిన ఈ అంశాలన్నీ ప్రస్తుతానికి కూడా తగినటువంటివే.

ఎవరూ కూడా తమ స్వంత మతంను మాత్రమే గౌరవించి, ఇతర మతాలను దూషించకూడదు. దానికి బదులుగా ప్రతి ఒక్కరూ ఇతర మతాలను వివిధ కారణాలరీత్యా గౌరవించాలి. అలా చేయడం ద్వార ప్రతి ఒక్కరు తమ స్వంత మతాభివృద్ధికి సహాయ పడటమే కాదు ఇతర మతాలకు కూడా సేవ అందించిన వారు అవుతారు. ఇలా కాకుండా దీనికి వ్యతీరేఖంగా వ్యవహరిస్తే, తమ స్వంత మతాలకు సమాధి తవ్విన వారు కావడమే కాకుండా ఇతర మతాలకు హాని చేసిన వారు అవుతారు. తమ మతాన్ని గౌరవిస్తు, ఇతర మతాల్ని దూషించే వాళ్ళు, తమ మతం పట్ల ఉన్న ఆరాధనా భావం వల్ల, "నేను నా మతాన్ని ప్రకాశింప చేస్తున్నాను" అని ఆలోచించడం వల్ల చేస్తూ ఉండవచ్చు. కాని వారి చర్యలు తమ స్వంత మతానికే చాలా నష్టం కలుగజేస్తాయి. నమ్మకాల మధ్య సమన్వయము మంచిది. మనం అందరం ఇతరులు బోధించిన సిద్దాంతాలను వినడానికి సిద్ధంగా ఉందాము మరియు విందాము. (శిలా ఫలకం 12)

అశోక చక్రవర్తి శాంతి సహనంలతో కూడిన ఒక గొప్ప సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ సంప్రదాయం నేటికి ప్రభుత్వాలు,పాలకులలో ఉన్నది. అందుకు ఉదాహరణ ఒమాన్ దేశ ఉదాత్త చక్రవర్తి, అతను తన మతాన్ని భక్తి, విశ్వాసాలతో పాటిస్తూనే, చర్చిలు మరియు ఇతర విశ్వాసాలకు చెందిన దేవయాలకు భూమిని దానం చేసాడు . అలాంటి కారుణ్య పాలకులు, ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తు ఉంటారని నాకు నమ్మకం ఉంది. చెప్ప బడిన విధంగా "శాంతి సంధాతలు ధన్యులు. ఎందుకంటే వారే దేవుని కుమారులు అని చెప్పబడింది గదా!".

హింసను సమర్దించే వారు ప్రధానంగా తమ స్వంతవారినే గాయపరుస్తారనేది చాలా స్పష్టం. వారు తమ అసహనం ద్వార ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో హింసను ప్రేరిపించే విధంగా చేస్తారు. మరోవైపు, "దయాళువులు ధన్యులు, ఎందుకంటే వారే దయను పొందుతారు" అని అన్నారు గదా! ఇది ప్రకృతి నియమం. దీనినే దేవుని శాసనం లేదా మార్గం అని కూడా అనవచ్చు. "శత్రుత్వంను, శత్రుత్వంతో నిర్ములించలేము కాని దాని వ్యతిరేకమైన దానితోనే (మిత్రుతత్వం) నిర్మూలించవచ్చు, ఇది ఒక శాశ్వతమైన ధర్మం(ఆధ్యాత్మిక నియమం)" అని బుద్ధుడు అన్నారు. భారత దేశంలో ధర్మం అని పిలువబడే దానికి, హిందూ, బుద్ధ, జైన, క్రైస్తవ, ఇస్లాం, సిక్కు,జుడాఇసం మరి ఏ ఇతర మతాలతో ఏమి సంబంధం లేదు. ఇది ఒక సరళ సత్యం: "నీవు ఇతరులకు హాని చేసే ముందు నీకు నీవే, మానసిక ప్రతికూలత పెంపొందించుకోవడం ద్వారా హాని పరచుకుంటావు. ఈ ప్రతికులతను తొలగించడం ద్వారా, నీలోని శాంతిని కనుగొనగలవు. అంతేగాక ప్రపంచంలో శాంతినీ బలోపేతం చేయగలవు.

ప్రపంచ శాంతి కోసం మనోశాంతి

ప్రతి మతం కూడా, తమ అనుచరులను మనస్సు మీద ఆధిపత్యం సాధించడానికి, మనసు నిర్మల పరచుకోవడానికి, ఒక నైతిక విలువలు కలిగిన నీతివంతమైన జీవితం జీవించమని చెప్తుంది. ఒక మతం "మీ పొరుగు వారిని ప్రేమించండి" అని చెపుతోంది. ఇంకొకటి చెపుతుంది "సలాం వలెకుం" అంటే - "శాంతి మీతో ఉండుగాక" అని. వేరొకటి "భవతు సబ్బ మంగళం" లేదా "సర్వే భవంతు సుఖినః" అంటుంది. అంటే- ప్రాణులన్నీ సుఖంగా ఉండు గాకా అని. అది బైబిల్, ఖురాన్ లేదా గీతైనా, అన్ని గ్రంథంలు శాంతి, స్నేహాలనే బోధిస్తున్నాయి. మహావీర్ నుండి యేసు ప్రభువు దాకా అన్ని మత వ్యవస్థాపకులు సహనం, శాంతికి ఆదర్శవంతులు. కాని మన నేటి ప్రపంచంలో ఇంకా తరచుగా మత కలహాలు, వర్గ యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి. ఎందుకంటె మనం మతపు బయటి పొరకే ప్రాముఖ్యత నిచ్చి దాని సారాంశాన్ని విస్మరిస్తున్నాము. దాని ఫలితంగా మనలో ప్రేమ, కరుణ కనుమరుగవుతున్నాయి.

వ్యక్తులలో శాంతి లేకపోతే ప్రపంచ శాంతి సాధ్యం కాదు. శాంతి మరియు ఆందోళన కలసి ఉండలేవు. అంతః శాంతి సాధించడానికి ఒక మార్గం విపశ్యన లేదా అంతర్దృష్టి ధ్యానం - ఇది ఒక మతాతీత, శాస్త్రీయ, మరియు సత్వర ఫలితాలనిచ్చే, స్వీయ పరిశీలనతో సత్యాన్ని గుర్తించే మార్గం. ఈ పద్ధతి సాధన ద్వార మనస్సు-శరీర పరస్పర ప్రతిస్పందన అనుభూతిపరంగా అవగాహనకు వస్తుంది. మనస్సులో ద్వేషం లాంటి ప్రతికూల భావనలు జనించిన ప్రతిసారి, అది శరీరంలో అప్రియ సంవేదనలకు కారణం అవుతుంది. మనస్సులో నిస్వార్థ ప్రేమ, కరుణ మరియు సద్భావనలు జనించిన ప్రతిసారీ, శరీరంలో ప్రియమైన సంవేదనలు వెల్లువెత్తుతాయి. ప్రతి శారీరక, వాచిక చర్యల కంటే ముందుగా మానసిక చర్య జరుగుతుంది. ఆ మానసిక చర్యే జరగబోయే శారీరక, వాచిక చర్యలు ఆరోగ్యకరమైనవా, అనారోగ్యకరమైనవా అని నిర్ణయిస్తుంది. ఈ విషయం విపశ్యన సాధన ద్వార తెలుస్తుంది. మనస్సు అత్యంత కీలకం. అందుకే మనం మనస్సును ప్రశాంత పరిచే, శుద్ధి పరిచే ఆచరణాత్మక విధానాలను కనుగొనాలి. అటువంటి విధానాలు, ఈ ప్రపంచ శాంతి సదస్సు నుండి వెలువడే ఉమ్మడి ప్రకటన ప్రభావాన్ని అధికం చేస్తాయి.

పురాతన భారత దేశం ప్రపంచానికి రెండు సాధనాలను ఇచ్చింది. ఒకటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శారీరక వ్యాయామమైన యోగ భంగిమలు (ఆసనాలు) మరియు శ్వాస నియంత్రణ (ప్రాణాయామ) . రెండవది మనస్సును ఆరోగ్యంగా ఉంచే విపశ్యన లాంటి మానసిక సాధన. ఏ మత విశ్వాసాన్ని, అనుసరించే వారైన ఈ రెండు పద్దతులను ఆచరించగలరు మరియు ఆచరించవచ్చు. అదే సమయంలో వారు, తమ మతాలను శాంతిసామరస్యాలతో అనుసరించవచ్చు; ఉద్రిక్తత మరియు సంఘర్షణల కారణమైన మత మార్పిడి అవసరం లేదు.

సమాజ శాంతి కొరకు, మరింత ఎక్కువ ప్రజలు శాంతియుతంగా ఉండాలి. నాయకులుగా ప్రేరణ కలిగించే ఒక ఉదాహరణగా మనం ఉండాల్సిన భాద్యత మనపై ఉంది. ఒక యోగి ఒకసారి "అసమతుల్యమైన మనసులను సమతుల్యం చేయడానికి ఒక సమతుల్యమైన మనసు కావాలి ", అని అన్నారు

ఇంకా వివరంగా చెప్పాలంటే, ఒక శాంతియుత సమాజం ప్రకృతితో శాంతియుతంగా నివసించడానికి మార్గం కనుగొంటుంది. పర్యావరణం కలుషితం కాకుండా పరిరక్షించవలసిన అవసరం ఉందని మనందరికి తెలుసు. కాని, దాని కొరకు పని చేయకుండా మనలోని అజ్ఞానం, క్రూరత్వం లేదా దురాశ వంటి మానసిక కాలుష్య నిల్వలు నిరోధిస్తాయి. అటువంటి కాలుష్యాల నిర్మూలన మానవుల మధ్య శాంతిని పెంపొందించటమే కాక, మానవ సమాజం మరియు పర్యావరణం మధ్య సంతులిత, ఆరోగ్యకరమైన సంబంధం పెంపొందిస్తుంది. ఈ విధంగా మతం పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించగలదు.

అహింస: ఒక కీలకమైన మత నిర్వచనం

మతాల మధ్య తేడాలు ఉండే తీరుతాయి. కాని ఈ ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సులో అన్ని ప్రధాన మతవిశ్వాసాల నాయకులు పాల్గొనడం ద్వారా, వారంతా శాంతి కోసం పని చేయాలని కోరుకుంటున్నారని చూపించారు. శాంతి "విశ్వజనీన మతం" యొక్క మొదటి సూత్రం అగు గాక! హత్యలు చేయకుండా ఉంటూ, హింసను ఖండిస్తున్నామని మనం కలసికట్టుగా ప్రకటిద్దాము. ఈ ప్రకటనలో రాజకీయ నాయకులు కూడా పాలుపంచుకోవాలని నేను అర్థిస్తున్నాను. ఎందుకంటే వారే యుద్ధం లేదా శాంతిని గాని తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తారు కాబట్టి. వారు పాల్గొన్నా, పాల్గొనక పోయినా కనీసం మనమందరం ఇక్కడే, ఇప్పుడే ఒక ప్రతిజ్ఞ చేద్దాం: హింస మరియు హత్యల విషయంలో రాజీ పడటానికి బదులుగా, మనం బేషరతుగా అటువంటి పనులన్నీ, ముఖ్యంగా మతం పేరుతో సాగిస్తున్న హింసను ఖండిస్తున్నామని ప్రకటిద్దాం.

ఇంతకు ముందు కొందరు ఆధ్యాత్మిక నాయకులకు, తమ స్వంత మత విశ్వాసం పేరుతో జరుగుతున్న హింసను ఖండించే వివేకం, ధైర్యం ఉండేవి. క్షమను కోరడం లేదా గతంలో జరిగిన హింస, హత్యల గురించి విచారం వ్యక్తం చేయడం పట్ల వేర్వేరు తత్వ, మత భావాలు ఉండవచ్చు. కాని గతంలో చేసిన ఆ హింస గురించి ఒప్పుకోవడమే, అది తప్పుని, భవిష్యత్తులో క్షమార్హమైనదని కాదని తెలియజేస్తోంది.

ఈ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మనం మతం మరియు ఆధ్యాత్మికతకు ఒక నిర్వచనం రూపొందించటానికి ప్రయత్నిద్దాము. ఆ నిర్వచనం అహింసను ప్రధానంగా ప్రభోదించేదై; హింస,హత్యలను తిరస్కరించేది లాగా ఉండాలి. మతాన్ని శాంతికి పర్యాయపదంగా నిర్వచించడంలో వైఫల్యం చెందడం కన్నా మానవత్వానికి పెద్ద దురదృష్టం ఏది ఉండదు. ఈ సదస్సు "విశ్వజనీన మతం" లేదా "మతంతో సంబంధం లేని ఆధ్యాత్మికత" అనే ఒక భావనను ఐక్యరాజ్యసమితి ఆమోదం కొరకు ప్రతిపాదించ గలదు.

ఈ సదస్సు మతం యొక్క నిజమైన ప్రయోజనం పై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవటానికి సహాయ పడుతుందని నేను విశ్వసిస్తున్నాను:

మతం మనల్ని విడదీయదు;
అది శాంతి మరియు హృదయ స్వచ్ఛతను ప్రబోద్ధిస్తుంది.

ఈ చారిత్రాత్మక సదస్సు నిర్వాహకుల, దూరదృష్టి మరియు కృషికి వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే పరిపక్వతతో సయోధ్య కోసం పని చేసి, మతం మరియు ఆధ్యాత్మికత మానవజాతి ప్రశాంత భవిష్యత్తుకు దారితీస్తుందని విశ్వాసం కలిగించిన మత, ఆధ్యాత్మిక పెద్దలందరిని నేను అభినందిస్తున్నాను.

అన్ని జీవులు ద్వేషం నుండి విముక్తి పొంది ఆనందంగా ఉండును గాక!

శాంతి, సామరస్యాలు వర్థిల్లు గాక!