విపశ్యన
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన
ధ్యానం
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
విపశ్యన ధ్యాన పధ్ధతి గురించి ప్రశ్నోత్తరములు
విపశ్యన శిబిరం పదిరోజులు ఎందుకు ఉంటుంది?
నిజానికి ఇది తక్కువలో తక్కువ సమయం. పది రోజులలో ఈ ధ్యానపద్ధాతిని నేర్చుకొని, అభ్యాసం చేయడానికి అవసరమైన పునాది ఏర్పడుతుంది. ఇది జీవితకాలం ఆచరించవలసిన విద్య. ఎన్నో తరాల వారి అనుభవంతో తెలిసిందేమిటంటే, పది రోజుల కన్నా తక్కువ సమయంలో ఈ ధ్యానం అనుభవపూర్వకంగా సరిగా పట్టుపడదు. పూర్వకాలంలో సాంప్రదాయానుసారం ఈ ధ్యానం నేర్చుకోవడానికి ఏడు వారాలు ధ్యానకేంద్రంలో ఉండవలసి వచ్చేది. 20వ శతాబ్దపు ఆగమనంతో, ఈ పరంపరకు చెందిన ఆచార్యులు, కాలానుగుణంగా ప్రజల వేగవంతమైన జీవన విధానానికి అనుకూలంగా ఉండటానికి పలు ప్రయోగాలు చేశారు. 30 రోజులు, 15 రోజులు, 10 రోజులు, 7 రోజుల శిబిరాలు నిర్వహించి చూశారు. శిబిరంలో చేరిన సాధకులు తమ మనసును కుదుట పరచుకుని, శరీర-చిత్తముల ఘటనా ప్రపంచమును చూసి తెలుసుకోవడానికి బాగా లోతుగా పనిచెయ్యాల్సి ఉంటుంది కాబట్టి, పదిరోజుల కన్నా తక్కువ సమయంలో ఇది సాధ్యం కావడంలేదని వారు గ్రహించారు.
రోజుకు ఎన్ని గంటలు ధ్యానం చేయవలసి ఉంటుంది?
ఉదయం 4-00 గం||లకు మేల్కొలుపు గంటతో నిద్రలేవడంతో మీ దినచర్య ప్రారంభమై, రాత్రి 9-00 గం||లకు ముగిస్తుంది. రోజుకు దాదాపు 10 గంటలు ధ్యానం చేయవలసి ఉంటుంది. మధ్యలో అల్పాహారం, భోజనం, స్నానాదులకు, విశ్రాంతి తీసుకోవడానికి తగినంత విరామ సమయాలు ఉంటాయి. రోజూ సాయంత్రం 7-00 గం||లకు ఆడియో/వీడియోల ద్వారా శ్రీ గోయెంకా గారి ప్రవచనాలు ఉంటాయి. సాధకులు ప్రతిదినం తమ సాధనలో కలిగే అనుభవాలను అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఈ రకమైన కాల పట్టిక అనువైనదిగా, లాభదాయకంగా ఉందని దశాబ్దాలుగా లక్షలాది సాధకుల అనుభవంతో రుజువైంది.
శిబిరం ఏ భాషలో ఉంటుంది?
శ్రీ సత్యనారాయణ గోయెంకా గారి బోధనలు రికార్డింగ్ ద్వారా వారి మాటల్లోనే ఇంగ్లీషు లేక హిందీ భాషలలో ఉంటాయి. వీటితో పాటు స్థానిక భాషలో అనువాదం కూడా ఉంటుంది. టేపుల్లో ఇంగ్లీషు సహా దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోనూ అనువాదాలు కలవు. ఒకవేళ శిబిరం నిర్వహించే ఆచార్యులు ప్రాంతీయ భాషలో ధారాళంగా మాట్లాడలేకపోతే అనువాదకుల సహాయం ఉంటుంది. శిబిరం చేయదలచిన సాధకులకు సాధారణంగా భాష అవరోధము కాదు.
శిబిర రుసుము ఎంత?
విపశ్యన ధ్యానం నేర్చుకోవడానికి, శిబిరంలోని భోజన వసతులకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బహుమానం మీకు పాత సాధకుల నుండి లభిస్తుంది. ప్రపంచమంతటా విపశ్యన శిబిరాలు సాధకులు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళలతోనే నిర్వహించబడుతున్నాయి. శిబిరం చివర్లో మీకు గనుక ఈ ధ్యానం నుండి లాభం కలిగిందని అనిపిస్తే, ఇటువంటి లాభం ఇతరులు కూడా పొందాలనే భావంతో మీరు మీ ఇచ్ఛానుసారం, మీ స్తోమతను బట్టి దానం ఇవ్వవచ్చు.
శిబిరం నిర్వహించే ఆచార్యులకు ఏమైనా పారితోషికం ఇవ్వబడుతుందా?
ఆచార్యలు డబ్బుకానీ, దానంగానీ, వస్తురూపంలో కానీ ఏదీ స్వీకరించరు. ఇది వారు స్వచ్ఛందంగా ఇచ్చే ధర్మసేవ. ప్రతి ఆచార్యునికి తన స్వంత అవసరాలకోసం తగిన ఆదాయం ఉండి తీరవలసిందే. ఈ నియమం కారణంగా కొందరు ఆచార్యులు తక్కువ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నియమం సాధకులను ఎవరైనా స్వలాభానికి వాడుకోవడం నుండి, ఈ విద్యను వ్యాపార వస్తువుగా తయారు కావడం నుండి కాపాడుతుంది. పది రోజుల శిబిరం పూర్తి అయిన తరువాత సాధకుల ఆనందం చూడటమే వారికి దొరికే సంతృప్తి.
నేను కాళ్ళు మడిచి కూర్చోలేను. మరి నేను ధ్యానం నేర్చుకోవడానికి రావచ్చునా?
తప్పకుండా, ఏదైనా శారీరిక ఇబ్బంది వల్ల క్రింద కూర్చొని ధ్యానం చేయలేని వారికి, వయోవృద్ధులకు కుర్చీలు ఏర్పాటు చేయబడతాయి.
నేను ప్రత్యేక ఆహరం తీసుకోవాలి. నా భోజనం నేనే తెచ్చుకోవచ్చా?
మీ డాక్టర్ ఏదైనా ప్రత్యేక ఆహారం మీకు సూచించి ఉంటే, మాకు తెలియజేయండి. మేము మీకు అవసరమైనది అందిచ గలమో లేదో చూస్తాము. ఆహరం మరీ ప్రత్యేకమైనది లేదా ధ్యానంకు తగినది కానిచో, మేము మిమ్మల్ని ధ్యానముకు అనువుగా అయ్యే వరకు వేచి ఉండమని అడగవచ్చు. మమ్మల్ని క్షమించండి కాని సాధకులు వారికి అందించిన ఆహరం నుండి మాత్రమే ఎంచుకోవలసి ఉంటుంది. తమ ఆహరం తామే తీసుకు రాకూడదు. మేము అందించే ఆహర పదార్థాలు సాధారణంగా అందరికీ తగినట్లే ఉంటాయి. ఈ మామూలు శాహాఖారంను ఇష్టపడతారు.
గర్భిణీ స్త్రీలు శిబిరంలో పాల్గోనవచ్చునా? వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లుగానీ, సూచనలు గానీ ఏమైనా ఉంటాయా?
నిశ్చితంగా గర్భిణీ స్త్రీలు శిబిరంలో పాల్గొనవచ్చును. ఎంతోమంది మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ధ్యానకేంద్రంలోని ప్రశాంతమైన వాతావరణంలో, లోతుగా, మౌనంగా ధ్యానం చేసుకునే అవకాశంకోసం శిబిరాలలో పాల్గొనడానికి కావాలని వస్తుంటారు. ఇలాంటప్పుడు ముందు వాళ్ళ గర్భం నిలకడగా ఉన్నదా, ఆ విషయంలో వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారా అని నిర్ధారించుకున్న తరువాతే వాళ్ళను రమ్మని చెపుతుంటాము. శిబిరంలో వాళ్లకు అవసరమైన అదనపు ఆహారం ఇస్తూ, ఏ విధమైన ఒత్తిడి లేకుండా వీలైనంత అనుకూలమైన రీతిలో సాధన చేయమని చెబుతాము.
శిబిరంలో మౌనము ఎందుకు పాటించాలి?
శిబిరంలో పాల్గొనే సాధకులు అందరూ "ఆర్య మౌనము" పాటించవలసి ఉంటుంది. "ఆర్య మౌనము" అంటే శరీరం ద్వారా (సైగలతో), వాక్కుతోనూ, మనస్సుతోనూ మౌనము పాటించడం. సాధకులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటామని ఒప్పుకొనే శిబిరంలో చేరుతారు. కాని తమ రోజువారి అత్యవసర వస్తువుల కోసం యాజమాన్యం వారితో మాట్లాడవచ్చు. సాధన గురించి ఏవైనా సందేహాలు ఉంటే, ఆచార్యులతో మాట్లాడవచ్చు. శిబిరం ప్రారంభమైనప్పటి నుండి మొదటి తొమ్మిదిరోజులు పూర్తిగా మౌనము పాటించడం జరుగుతుంది. పదవరోజు తిరిగి దైనందిన ప్రపంచంలోకి అనుకూలంగా ఇమడడానికి పరస్పరం మాట్లాడుకోవడానికి అనుమతించబడుతుంది. నిరంతర సాధనయే ఈ ధ్యానంలో సాఫల్యానికి సోపానం, కాబట్టి ఈ నిరంతరతను కొనసాగించడానికి మౌనము పాటించడం ఏంతో ముఖ్యం.
ఈ ధ్యానం చేయడానికి సరిపడ సామర్థ్యం నాకు ఉందని నేను ఎలా తెలుసుకోగలను?
సముచితమైన శారీరిక, మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తికీ మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలన్న నిజమైన అభిరుచి ఉంటే, ఈ ధ్యానం (ఆర్య మౌనము పాటించడంతో సహా) నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు. మీరు గనుక సూచనలను ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో అనుసరించగలిగితే ఫలితం తప్పక ఉంటుంది. నిజమే! రోజువారీ కాలపట్టికను చూసినప్పుడు భయమేస్తుంది. కాని, వాస్తవానికి ఇది మరీ అంత కఠినమైంది ఏమీ కాదు; మరీ విశ్రాంతమైనదీ కాదు. ప్రశాంతపూరిత అనుకూల వాతావరణంలో, మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ అభ్యాసం చేస్తున్న తోటి సాధకుల మధ్య కూర్చొని ధ్యానం చేయడం వల్ల, మీరు చేసే ప్రయత్నానికి ఇతోధిక సహాయం లభిస్తుంది.
ఈ ధ్యాన శిబిరంలో చేరడానికి అనర్హులైనవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరైనా శారీరికంగా చాలా దుర్బలంగా ఉన్నప్పుడు, కాలపట్టికను అనుసరించి పనిచేయలేరు. కాబట్టి అలాంటివాళ్ళు ఈ శిబిరం నుండి లాభం పొందలేరు అన్నది సుస్పష్టమైన విషయమే. తీవ్రమైన మానసిక రోగాలు ఉన్నవాళ్ళకు, అత్యంత భావావేశ ఉపద్రవం ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. ప్రశ్నోత్తరాల రూపంలో మాట్లాడి, అలాంటి అభ్యర్థులు శిబిరం నుండి సరైన లాభం పొందగలిగేదీ లేనిదీ నిర్ధారించి చెప్పే ప్రక్రియ ద్వారా మేము వాళ్ళకు సహాయపడతాము. కొన్ని సందర్భాలలో, శిబిరంలో చేరడానికి అనుమతి ఇచ్చేముందు, దరఖాస్తుదారులు తమ డాక్టరును సంప్రదించి అనుమతి పత్రం తీసుకురావాలని కోరడం జరుగుతుంది.
విపశ్యన వల్ల శారీరిక, మానసిక రోగాలు తొలగిపోతాయా?
చాలా రోగాలు మనలోని అలజడి మూలంగా వస్తుంటాయి. ఈ అలజడిని తొలగించుకున్నప్పుడు, రోగం తగ్గడమో లేక తొలగిపొవడమో జరుగుతుంది. కాని రోగాన్ని నయం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో విపశ్యనను నేర్చుకోవాలనుకుంటే అది వృథాశ్రమే అవుతుంది. ఇలాంటి ఉద్దేశ్యంతో వచ్చేవాళ్ళు తప్పుడు లక్ష్యం మీద దృష్టి పెడతారు. కాబట్టి తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. వారికి వారే హాని కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ధ్యానాన్ని అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా, తమ రోగాన్ని తొలగించుకోవడంలోనూ సఫలులు కాలేరు.
మరి మానసికంగా బాగా కృంగిపోయి (Depression) ఉన్న వారి సంగతేంటి? విపశ్యన దానిని నయం చేస్తుందా?
విపశ్యన ఉద్దేశ్యం రోగాలను నయం చేయడం కాదు. విపశ్యనను నిజంగా అభ్యాసం చేసేవారు అన్ని పరిస్థితులలో సంతోషంగా, సమతుల్యంగా ఉండడం నేర్చుకుంటారు. కాని మానసికంగా తీవ్రమైన వ్యాకులతకు లోనై ఉన్న వ్యక్తీ ఈ ధ్యాన పద్ధతిని సరైన రీతిలో వినియోగించుకోలేక పోవచ్చు. కాబట్టి ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. ఇలాంటి వ్యక్తి వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స పొందాలి. విపశ్యన ఆచార్యులు ధ్యాన నిపుణులే గాని మానసిక చికిత్సకులు కారు.
విపశ్యన ప్రజలను మానసికంగా అస్థిరంగా చేస్తుందా?
లేదు. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అవగాహనతో, సమతతో ఉండటం ఎలాగో విపశ్యన నేర్పుతుంది. కాని ఎవరైనా తమ త్రీవ మానసిక సమస్యలను దాచి పెట్టి శిబిరానికి వస్తే, వాళ్ళు ఈ పద్దతిని అర్థం చేసుకోలేక పోవచ్చు లేదా కావలసిన ఫలితాలను పొందటానికి దానిని సరిగా పాటించలేక పోవచ్చు. అందువలన మీ గత చరిత్ర మాకు తెలియచేయడం ముఖ్యం. దానితో మీరు ఈ శిబిరం నుండి ప్రయోజనం పొందగలరో లేదో మేము నిర్ధారించగలము.
విపశ్యన సాధన చేయడానికి నేను బౌద్ధుడనై ఉండాలా?
అనేక మతాలకు చెందినవారికి, ఏ మతానికి చెందనివారందరికీ కూడా ఈ ధ్యాన పధ్ధతి ఎంతో ఉపయోగకరంగా మరియు ప్రయోజనకారిగా అనిపించింది. విపశ్యన అనేది జీవన కళ, జీవించే ఒక మార్గం. ఇది బుద్ధుని బోధనల సారమైనప్పటికీ, ఇది ఒక మతం కాదు. మానవ విలువలను నాటి మనకు, ఇతరులకు శ్రేయస్సును కలిగించేది.
మొత్తం పది రోజులు ఇక్కడే ఎందుకు ఉండాలి?
విపశ్యన పద్ధతిని క్రమ క్రమంగా, శిబిరం చివరి వరకూ, ప్రతి రోజూ ఒక కొత్త అడుగు ముందుకు వేయిస్తూ నేర్పిస్తారు. మీరు మధ్యలో వెళ్ళిపోతే, మీరు ధ్యాన పద్ధతిని పూర్తిగా నేర్చుకోలేరు. ఇంకా ఈ ప్రక్రియ మీకు ఉపయోగపడటానికి దానికి మీరు అవకాశం ఇవ్వటం లేదు. అంతే కాకుండా, చివరిదాకా గంభీరంగా సాధన చేయడం ద్వారా సాధకులలో మెదలయ్యే పరిణామము, శిబిరం పూర్తి అయ్యేటప్పటికి ఫలవంతమవుతుంది. ఈ ప్రక్రియకు మధ్యలోనే అంతరాయం కలిగించడం సమంజసం కాదు.
శిబిరంను మధ్యలో వదిలేస్తే ఏమైనా ప్రమాదమా?
విషయమేమిటంటే, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీరు మీలో పూర్తి మార్పుని రానివ్వటం లేదు. మీకు మీరుగా పూర్తి ధ్యాన పద్ధతిని నేర్చుకునే అవకాశాన్ని జారవిడిచినట్టే. అందు మూలాన మీరు దీన్ని మీ దైనందిన జీవితంలో ప్రభావవంతంగా ఉపయోగించలేరు. అంతే కాదు, ఈ ప్రక్రియకు మీరు మధ్యలోనే అంతరాయం కలిగిస్తారు, దాన్ని సరిగ్గా పూర్తి కానివ్వరు. ఒక్కటి, రెండు రోజులు ముందు ఇల్లు చేరే ప్రయత్నంలో ఇప్పటివరకు వినియోగించిన మొత్తం సమయాన్ని వృథా చేసుకుంటారు.
మరి పదవ రోజు గంభీర సాధన సమాప్తమై, మాట్లాడటం అనుమతించినప్పుడు? అప్పుడు నేను వదిలి వెళ్ళ వచ్చా ?
మళ్ళీ సాధారణ జీవితానికి అలవాటుపడటానికి పదవ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు వదిలి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు.