విపశ్యన ధ్యానము

విపశ్యన అంటే వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. విపశ్యన భారతదేశం యొక్క అత్యంత పురాతన ధ్యాన పద్ధతులలో ఒకటి. దాదాపు 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు దీనిని తిరిగి కనుగొని సమస్త దు:ఖాలకు సార్వజనీనమైన నివారణ మార్గంగా అందరికీ అందించారు అంటే ఒక  జీవన కళ ఈ మతాతీత ప్రక్రియ ముఖ్య లక్ష్యం ఏమిటంటే - మనస్సులోని వికారాలను సమూలంగా నిర్మూలించి తద్వారా కలిగే సంపూర్ణ విముక్తి వలన పరమానందాన్ని కలుగజేయటం. నిర్మూలనమంటే, కేవలం వ్యాధి నిరోధమే కాకుండా సంపూర్ణ మానవ దు:ఖ నిర్మూలనమే దీని లక్ష్యము.

విపశ్యన స్వీయ పరిశీలన ద్వారా స్వీయ పరివర్తన కలిగించే మార్గం. ఇది శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన పరస్పర సంబంధాన్ని తెలియజేస్తుంది. శారీరిక సంవేదనలపై నియమబద్ద ధ్యాస పెట్టటం ద్వారాఈ సంబంధాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఈ సంవేదనలే శరీరానికి, మనస్సుకు జీవమిస్తూ ఉంటాయి. ఇవి మనసుతో నిరంతరంగా పరస్పర సంబంధాన్ని కలిగి మనస్సు యొక్క ప్రాణంపై నియంత్రణను కలిగి ఉంటాయి. శరీరము మరియు మనస్సుల యొక్క ఉమ్మడి మూలమూలకు చేర్చే ఈ పరిశీలనా ఆధారిత, స్వీయ అన్వేషణా మార్గమే మానసిక వికారాలను తొలగించి, ప్రేమ మరియు కరుణతో నిండిన సమతుల్యమైన మనస్సును కలిగిస్తుంది.

మన ఆలోచనలు, భావాలు, నిర్ణయాలను మరియు సంవేదనలను ప్రభావితం చేసే వైజ్ఞానిక నియమాలు స్పష్టమవుతాయి. ప్రత్యక్ష అనుభవం ద్వారా, ఒకరు ఎలా పురోగామిస్తారో లేదా తిరోగమిస్తారో, ఎలా దు:ఖాన్ని జనింపజేస్తారో లేక దు:ఖం నుండి తమను తాము విముక్తి కలిగించుకోగలరో అన్న ధర్మములు అవగతమవుతాయి. జీవితంలో అవగాహన పెరుగుతుంది. భ్రాంతి తొలిగి, స్వీయ-నియంత్రణ మరియు శాంతి అనే లక్షణాలు గల జీవనము తయారవుతుంది.

సాంప్రదాయము

బుద్ధుని కాలం నుండి ఇప్పటివరకు , విపశ్యనా ధ్యాన పద్ధతిని అవిచ్చన్నమైన గురు శిష్య పరంపర ద్వారా కాపాడబడి మనకు అందజేయబడినది. ప్రస్తుత ఆచార్యలు శ్రీ సత్యనారాయణ గోయెంక గారి పూర్వీకులు భారత సంతతికి చెందిన వారే అయినా, వారి జననం మరియు పెంపకం మాత్రం బర్మా (మయన్మార్) లో జరిగింది. అక్కడ నివసిస్తున్న సమయంలో, ఉన్నత ప్రభుత్వ అధికార పదవిలో ఉన్న తన గురువు, సాయజి ఉ బా ఖిన్ గారి నుండి విపశ్యనను నేర్చుకునే అదృష్టం కలిగింది. పధ్నాలుగు సంవత్సరాలు తన గురువు గారి నుండి శిక్షణ పొందిన తరువాత, శ్రీ గోయెంకా గారు భారతదేశం లో స్థిరపడి, 1969 లో విపశ్యన బోధించడం ప్రారంభించారు. అప్పటి నుండి వారు తూర్పు మరియు పాశ్చాత్య దేశాలలోని అన్ని జాతులు మరియు అన్ని మతాలకు చెందిన వేలాదిమందికి బోధించారు. విపశ్యన శిబిరంలకు ఆదరణ పెరుగుతున్నందున 1982 లో వారు సహాయక ఆచార్యులను నియమించడం ప్రారంభించారు.

శిబిరాలు

ఈ ధ్యాన పధ్ధతి పది రోజుల శిబిరములలో నేర్పబడుతుంది. ఆ పది రోజులు సాధకులు ధ్యానకేంద్రములోనే నివాసముండాలి. సాధకులు క్రమశిక్షణ సూచికను పాటిస్తూ ఈ ధ్యానము యొక్క మూల పద్ధతిని నేర్చుకుని తగినంతగా సాధన చేసి చక్కటి ప్రయోజనాలను పొందుతారు.

శిబిరంలో కఠినమైన, గంభీరమైన సాధన చేయవలసి ఉంటుంది. శిక్షణలో మూడు మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు, శిబిరం పూర్తయ్యేవరకు హత్య, దొంగతనం, లైంగిక సంపర్కం, అసత్య భాషణం మరియు మత్తు పదార్థాల సేవనం నుండి దూరంగా ఉండాలి. ఈ సరళమైన నైతిక విలువలు మనస్సుని శాంత పరచడంలో ఎంతో దోహదపడతాయి లేకపోతే మనస్సు ఎంతో ఆందోళనగా, చంచలంగా ఉండి స్వీయ పరిశీలనలో ఇబ్బందులు కలుగజేస్తుంది. తదుపరి మెట్టులో ముక్కు రంధ్రములలోంచి సహజ సిద్ధంగా వచ్చి వెళ్ళే నిరంతర మార్పు గల శ్వాస మీద తమ మనస్సును కేంద్రీకరించి, మనస్సు మీద పట్టు సాధించే అభ్యాసం ఉంటుంది. సాధన నాలుగో రోజుకు చేరే సరికి మనస్సు శాంతబడి, కేంద్రీకృతమై మూడవ మెట్టు అయిన విపశ్యన సాధనకు అనుకూలంగా మారుతుంది. శరీరం అంతటా కలిగే సంవేదనలను గమనించడం, వాటి స్వభావాలను అర్థం చేసుకోవడం మరియు ప్రతిక్రియ చేయకుండా సమతను పెంపొందించుకోవడమే విపశ్యన సాధన. చివరగా, అంతిమ రోజున సాధకులు "మైత్రి" అనే ఒక కొత్త ధ్యాన పద్ధతిని నేర్చుకుంటారు. మైత్రి అభ్యాసం ద్వారా ఈ శిబిరంలో సంపాదించిన పుణ్యమును అందరికీ వితరణ చేయడం జరుగుతుంది.

ఈ సమస్త సాధన అంతా నిజానికి ఒక మానసిక శిక్షణయే. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు శారీరిక వ్యాయామాలు చేసినట్లే, ఆరోగ్యకరమైన మనస్సును అభివృద్ధి చేసుకోవడానికి విపశ్యన సాధన ఉపయోగపడుతుంది.

ఈ విద్య నిజానికి ఎంతో ఉపయోగకరమైనదని రుజువైనందున, దీనిని శుద్ధ రూపంలో పరిరక్షించడానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడుచున్నది. ఇది వాణిజ్య పరంగా కాకుండా ఉచితంగా బోధించబడుచున్నది. దీనిని నేర్పటంలో పాలుపరచుకునే వారందరూ కూడా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తారు. శిబిరాలకు ఎలాంటి రుసుము లేదు. - ఆహార మరియు వసతి ఖర్చులకు కూడా ఏ రుసుము లేదు. అన్ని ఖర్చులు శిబిరం పూర్తి చేసి విపశ్యన ప్రయోజనాలు స్వయంగా అనుభవించి, ఇతరులు కూడా అదేవిధంగా దీని నుండి లాభం పొందాలన్న ఉద్దేశ్యంతో పాత సాధకులు ఇచ్చే విరాళాల ద్వారానే భరించపడుతున్నాయి.

శిబిర ఫలితాలు నిరంతర సాధన ద్వారానే క్రమంగా వస్తాయి. అన్ని సమస్యలు పది రోజులలోనే పరిష్కరించబడాలని అనుకోవడం అవాస్తవం అవుతుంది. అయితే, నిత్య జీవితంలో అమలు పర్చగలిగే విధంగా ఈ పది రోజులలో విపశ్యన సాధనా పద్ధతిని నేర్చుకుంటారు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత దు:ఖ విముక్తి కలుగుతుంది, ముక్తి మార్గంలో కూడా అంత ముందుకు వెళ్ళగలరు. కేవలము ఈ పది రోజుల సాధన కూడా, రోజువారీ జీవితంలో కనిపించేటటువంటి ఉపయోగకరమైన స్పష్టమైన సత్ఫలితాలను పొందవచ్చు.

చిత్తశుద్ధితో పనిచేసే వారందరినీ విపశ్యన శిబిరములలో పాల్గొనమని స్వాగతిస్తున్నాము. ఈ శిబిరంలో పాల్గొని ఈ పధ్ధతి ఎలా పనిచేస్తుంది, దాని లాభాలను ఎలా పొందగలము అనే విషయాలను మీరు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు. దీనిని సాధన చేసిన ప్రతి ఒక్కరూ కూడా నిజమైన ఆనందాన్ని పొందడానికి మరియు ఇతరులతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఇది ఒక అమూల్యమైన ఉపకరణము అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు.